కోహ్లీ టాస్‌ గెలవలేదు!

 భారత్‌-శ్రీలంక మధ్య బుధవారం ఏకైక టీ20 మ్యాచ్‌లో తప్పిదం దొర్లింది. ఆతిథ్య జట్టు సారథి ఉపుల్‌ తరంగ టాస్‌ గెలిస్తే పొరబాటున కోహ్లీ గెలిచినట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. లంక పర్యటనను క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.
ఏలా జరిగిందంటే.. టాస్‌ వేయడానికి భారత్‌-శ్రీలంక జట్టు సారథులు కోహ్లీ, ఉపుల్‌ తరంగ మైదానంలోకి వచ్చారు. కోహ్లీ హెడ్స్‌ని ఎంచుకున్నాడు. ఆతిథ్య జట్టు సారథి ఉపుల్‌.. టాస్‌ కాయిన్‌ని గాల్లోకి ఎగురవేశాడు. మ్యాచ్‌ రిఫరీ వెళ్లి టైల్స్‌.. ఇండియా అన్నాడు. రిఫరీ ఇండియా అనడంతో కోహ్లీ టాస్‌ గెలిచినట్లు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మురళీ కార్తీక్‌ ప్రకటించాడు. తప్పిదాన్ని గుర్తించిన రిఫరీ దాన్ని సరిదిద్దుకునేలోగానే కోహ్లీ టాస్‌ గెలిచినట్లు ప్రకటించడంతో ఏమీ చేయలేకపోయాడు. టాస్‌ గెలిచిన కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు వర్షం కురిసిన కారణంగా లక్ష్యఛేదన చేసే జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ గెలిస్తే తాను కూడా బౌలింగ్‌ ఎంచుకునే వాడినని ఉపుల్‌ తరంగ చెప్పిన సంగతి తెలిసిందే.
ఒకవేళ ఉపుల్‌ తరంగ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంటే మ్యాచ్‌ ఫలితం ఏమయ్యేదో..!

Comments