సీఎం వ్యాఖ్యలు జాతీయ మీడియాలో ఎందుకు వైరల్ అయ్యాయి..?

2014 ఎన్నికల తర్వాత రాష్ర్టంలో తొలిసారిగా నంద్యాల అసెంబ్లీకి ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే! రాయలసీమలోని ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇదిలా ఉంటే... నంద్యాల పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. "నేను వేసిన రోడ్లపై తిరుగుతూ, నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటూ, నేను నిర్మించే ఇళ్లల్లో ఉంటూ నాకు ఓటు వేయరా..?'' అని చమత్కారపూర్వకంగా వ్యాఖ్యానించారు. వెంటనే ఈ వ్యాఖ్యలకి మసాలా దట్టించి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఈ వార్తలు ఢిల్లీలో జాతీయ మీడియా వరకూ పాకాయి. కొన్ని మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలపై చర్చలు పెట్టి మరీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించాయి. రెండు, మూడు రోజులపాటు రచ్చ కొనసాగింది.
 
        అనంతరం తెలుగుదేశం పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ వార్తల వెల్లువపై లోతుగా ఆరాతీయడం ప్రారంభించింది. బాబు వ్యాఖ్యలు అటు జాతీయ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీకి తెలిసింది. ఢిల్లీలో ఈ అంశంపై చక్రం తిప్పిన నేతలు ఎవరై ఉంటారోనని టీడీపీ నేతలు విచారించారు. అప్పుడు అసలు విషయం తెలిసి వారు అవాక్కయ్యారు. వైసీపీలో కొంతమంది నేతలు చంద్రబాబు వ్యాఖ్యల ఫుటేజీ ఉన్న చిప్‌లు ఇచ్చి మరీ జాతీయ మీడియాకు నూరిపోశారట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జరగాల్సిన నష్టం జరిగిపోయాక నష్టనివారణ చర్యలు చేపట్టామని టీడీపీ నేతలే ఇప్పుడు మధనపడుతున్నారు. సీఎం నవ్వుతూ అన్న మాటలపై ఇంత రాద్ధాంతం చేయడంపై తెలుగుదేశం నేతలు విస్తుపోతున్నారు కూడా. వర్తమాన రాజకీయాలు ఇలాగే తయారయ్యాయి మరి. అధికారంలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి కదా అని తెలుగు తమ్ముళ్లు వారిలో వారే సర్థిచెప్పుకుంటున్నారు.

Comments