బాహుబలి-భళ్లాల మళ్లీ కలిసి..

బాహుబలి, భళ్లాలదేవుడు ఈ పేర్లు వినగానే మరో ఆలోచన లేకుండా టక్కున గుర్తొచ్చే చిత్రం ‘బాహుబలి’. అంతలా అభిమానులకు చేరువైందీ చిత్ర రాజం. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ సృష్టించిన రికార్డులు అన్ని.. ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా రికార్డు వసూళ్లను సాధించింది. మళ్లీ బాహుబలి-భళ్లాల దేవుడు కలిసి అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఏం లేదండీ. రానా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి. కాజల్‌ కథానాయిక. తేజ దర్శకుడు. అగ్మెంటెడ్‌ రియాల్టీ సాంకేతికతతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని రానాతో కలిసి ప్రభాస్‌ కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ‘అవును ఇది నిజం. బాహుబలి స్వయంగా అగ్మెంటెడ్‌ రియాల్టీని పరిశీలిస్తున్నాడు’ అని రానా ట్వీట్‌ చేశారు. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Comments