జియోఫోన్‌.. భారత ఇంటెలిజెంట్‌ స్మార్ట్‌ఫోన్‌ !!

ముంబయి: టెలికాం చరిత్రలో జియోతో సంచనాలు సృష్టించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో సంచలన ప్రకటనతో ముందకొచ్చింది. 4జీ వీఓఎల్‌టీఈ ఆధారిత ఫీచర్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ముంబయిలో శుక్రవారం జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ జియోఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మేడిన్‌ ఇండియాలో భాగంగా యువ భారతీయులు ఈ ఫోన్‌ను తయారుచేసినట్లు ముఖేశ్‌ తెలిపారు. భారత ఇంటెలిజెంట్‌ స్మార్ట్‌ఫోన్‌గా ఈ జియోఫోన్‌ను పేర్కొన్నారు.
అనంతరం ఇషా, ఆకాశ్‌ అంబానీ, కిరణ్‌లు ఈ ఫోన్‌ ఫీచర్లపై డెమో ఇచ్చారు. వాయిస్‌ కమాండ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందని, 22 భాషలు సపోర్ట్‌ చేస్తుందని తెలిపారు. జియో యాప్స్‌ను కూడా ఇన్‌బిల్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. తర్వాత జియో ఫోన్‌ టారిఫ్‌లను ముఖేశ్‌ అంబానీ తెలియజేశారు. ఈ ఫోన్‌ ద్వారా జీవితకాలం పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌, అపరిమిత డేటాను అందిస్తున్నట్లు చెప్పారు. అపరమిత డేటా కోసం నెలకు రూ. 153తో రీఛార్జ్‌ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.
ఒక్క రూపాయి కూడా లేకుండా ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఫోన్‌ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కొంత డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేస్తే ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత ఒకేసారి తిరిగిఇవ్వనున్నారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్‌ ప్రీబుకింగ్స్‌ ప్రారంభమవుతుండగా.. సెప్టెంబర్‌లో ఇది అందుబాటులోకి రానుంది.

Comments