రివ్యూ: ఫిదా



తీసింది కొన్ని సినిమాలే అయినా  ప్రేక్ష‌కుల‌పై త‌న‌దైన ఓ ప్ర‌త్యేక‌ ముద్ర వేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆయ‌న  సినిమాలు చాలా నిజాయ‌తీగా, మ‌న జీవితాల్ని పోలిన‌ట్టుగా  ఉంటాయి. చూశాక ఒక మంచి అనుభూతిని క‌లిగిస్తాయి. ఆ అనుభూతి కొంత‌కాలం మ‌న‌తో పాటే ప్ర‌యాణం చేస్తుంది కూడా.  ఎప్పుడు ఏ సినిమా తీసినా దాన్ని త‌న జీవితంతో పోల్చి చూసుకొంటుంటారు శేఖ‌ర్ క‌మ్ముల‌. `ఫిదా` త‌న కూతురులాంటి సినిమా అని చెబుతూ  వ‌చ్చారు. ప్ర‌చార చిత్రాలు చూశాక నిజంగా ఆయ‌న ఎంతో  ప్రేమించి ఈ సినిమా తీశారని అర్థ‌మైంది. కొన్ని  ప‌రాజ‌యాల త‌ర్వాత...  కొంత‌కాలం పాటు  విరామం తీసుకొని  శేఖ‌ర్ క‌మ్ముల చేసిన  `ఫిదా`కి దిల్‌రాజు నిర్మాత కావ‌డం.. అందులో వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతో  అంచ‌నాలు పెరిగాయి.  మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా?  వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జోడీ ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసిందా లేదా?
క‌థేంటంటే?: వ‌రుణ్ (వ‌రుణ్‌తేజ్‌) అమెరికాలో ఓ డాక్ట‌ర్‌. త‌న అన్న‌య్య, త‌మ్ముడితో క‌లిసి నివ‌సిస్తుంటాడు. అన్న‌య్య పెళ్లిచూపుల కోస‌మ‌ని వ‌రుణ్  బాన్సువాడ రావాల్సి వ‌స్తుంది. వ‌చ్చాక పెళ్లి నిశ్చ‌య‌మ‌వుతుంది. ఆ ఇంట్లోనే ఉన్న పెళ్లికూతురు చెల్లెలు భానుమతి (సాయిప‌ల్ల‌వి)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమె కూడా వ‌రుణ్‌ని ఇష్ట‌ప‌డుతుంది. అయితే భానుమతికి త‌న ఊర‌న్నా, త‌న ఇల్లన్నా చాలా ఇష్టం. త‌న‌దైన ప్ర‌పంచంలో ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతుంది. కానీ వరుణ్ ఉద్దేశాలు వేరు. కెరీర్‌, అమెరికా అంటూ ఆలోచిస్తుంటాడు. ఇంత‌లోనే  చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు. దాంతో వ‌రుణ్‌కి దూరంగా ఉండాల‌నుకొంటుంది భానుమ‌తి. ఊళ్లోనే త‌న త‌ల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌ని కూడా  నిర్ణ‌యించుకొంటుంది. వ‌రుణ్ కూడా భానుమతికి దూరంగా ఉండాల‌నుకొంటాడు. మ‌రి అది సాధ్య‌మైందా?  లేదా?  భానుమతి పెళ్లి ఎవ‌రితో ఎలా జ‌రిగింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.ఎలా ఉందంటే?: శేఖ‌ర్ క‌మ్ముల శైలి ఫీల్ గుడ్ సినిమా ఇది.  కొన్ని జీవితాల్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన అనుభూతి క‌లుగుతుంది. తెర‌పై క‌నిపించే స‌న్నివేశాలు  మ‌న ఇంట్లోనో, మ‌న ప‌క్కింట్లోనే జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల్లా అనిపిస్తాయి. తొలి స‌గ‌భాగం క‌థ‌లో పెద్ద‌గా మ‌లుపులేమీ ఉండ‌వు. క‌థ బాన్సువాడ చేరాక వేగం అందుకొంటుంది. ఆ త‌ర్వాత వ‌చ్చే పాత్ర‌లు స‌హ‌జంగా సంద‌డి చేయ‌డం, సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొనేలా ఉండ‌టంతో సినిమా స‌ర‌దాగా సాగిపోతుంది. ద్వితీయార్ధంలోనే క‌థ మ‌న‌సుకి హ‌త్తుకొంటుంది. వ‌రుణ్‌, భానుమ‌తి  మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు... ఊరిని, క‌న్న‌తండ్రిని  వ‌దిలిపెట్టి వెళ్లే విష‌యంలో ఒక అమ్మాయి ప‌డిన సంఘ‌ర్ష‌ణని ఆక‌ట్టుకొనేలా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ప‌తాక స‌న్నివేశాల్లో మాత్రం ఆ బిగి కాస్త‌ త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. క‌థానాయ‌కుడు త‌న మ‌న‌సుని మార్చుకొని, ఇష్టప‌డిన అమ్మాయికోసం అమెరికా ఎలా వ‌దిలొచ్చాడ‌నే విష‌యాన్ని ఇంకాస్త లోతుగా చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఒక అంద‌మైన ప‌ల్లెటూరు, అంద‌మైన మ‌నుషుల నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ ఈ చిత్రం. తెలంగాణ యాస మ‌రింత అందంగా వినిపిస్తుంది. ప‌లు స‌న్నివేశాల‌కి యాసే బ‌లాన్నిచ్చింది.

ఎవ‌రెలా చేశారంటే?: వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట సినిమా పేరుకు త‌గ్గ‌ట్టుగానే ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసింది. ముఖ్యంగా సాయిప‌ల్ల‌వి త‌న మాట‌తీరుతోనూ, త‌న అందంతోనూ ఆక‌ట్టుకుంది. డ్యాన్సుల్లోనూ ప్ర‌తిభ‌ని కన‌బ‌రిచింది. వ‌రుణ్‌తేజ్  న‌ట‌న కూడా చాలా బాగుంది. క‌థ‌లో ఒదిగిపోయాడు. కొన్ని స‌న్నివేశాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ని గుర్తుకు తెప్పించాడు. వ‌రుణ్ అన్న వ‌దిన‌లుగా న‌టించిన రాజా, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ జంట ఆక‌ట్టుకునేలా న‌టించింది. సాయిచంద్‌, గీతా భాస్క‌ర్‌లు పాత్ర‌ల్లో ఒదిగిపోయి స‌హ‌జంగా న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. శ‌క్తికాంత్ సంగీతం, విజ‌య్ .సి.కుమార్ కెమెరా ప‌నిత‌నం చాలా బాగా కుదిరింది.  శేఖ‌ర్ క‌మ్ముల క‌థ‌ల్లో నిజాయ‌తీ, ఆయ‌న శైలి మ‌రోసారి ఈ చిత్రంలో ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తాయి. క‌థ కంటే కూడా  చిన్న చిన్న సంఘ‌ట‌న‌ల‌తోనూ... సంభాష‌ణ‌ల‌తోనూ త‌న శైలిని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

Comments