విచారణకు ముందు.. కలబంద సేవనం

త్తుమందుల కేసులో పట్టుపడ్డ వారికోసం క్రీడాకారులను పరీక్షించే పరికరాలు ఢిల్లీ నుంచి తీసుకొని రాబోతున్నట్లు ఆబ్కారీశాఖ కమిషనర్‌ చంద్రవదన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంచాలకులు అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు. సచివాలయంలో ఒక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వారిద్దరూ మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ప్రస్తుత కేసుల విషయానికి వస్తే తమ ఎదుట విచారణకు హాజరవుతున్నవారు.. వచ్చే ముందే అలోవెరా రసం తాగి తమ కడుపు ఖాళీ చేసుకొని వస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా తామెవ్వరికీ నోటీసులు ఇవ్వడం లేదని, అన్నీ పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు చట్టపరమైన చర్యలకు పూనుకుంటున్నామని స్పష్టం చేశారు. కేసులో అరెస్టయినవారు, ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నవారు పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు చెబుతున్నారని వివరించారు. సినీనటి ఛార్మి అనవసరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారనీ, ఆమెను తామెప్పుడూ నిందితురాలని అనలేదనీ, కొన్ని వివరాలు తెలుసుకునేందుకే పిలిచామనీ, ఇప్పుడామె తనంతటతానే నిందితురాలని ఒప్పుకున్నట్లయిందని వారు వివరించారు. ఆమెనే కాదు.. తామెవర్నీ నిందితులని చెప్పడం లేదనీ, కేవలం విచారణ కోసమే పిలుస్తున్నామన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయిందనీ, ఇందులో ప్రాంతీయ భేదాలు తీసుకొస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ యావత్తూ వీడియోలో నిక్షిప్తం చేస్తున్నామన్నారు. సిట్‌ బృందం ప్రస్తుతం రోజుకు నాలుగు కిలోల గంజాయి పట్టుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసుల గురించి ప్రతిరోజూ తాము ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నామని, మత్తుమందుల అమ్మకాలపై నిఘా వర్గాలు కూడా దృష్టి సారించాయని వారు వెల్లడించారు.
ఎవరా పెద్దలు?: అకున్‌ సబర్వాల్‌, చంద్రవదన్‌ పిచ్చాపాటీలో వెల్లడించిన అంశాలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా తాము విచారిస్తున్న వారు అనేక మంది పెద్దపెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు చెబుతున్నారనడంతో వారెవరు అనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ కేసులో అనేక మంది పెద్దలు ఉన్నారని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పిచ్చాపాటీ నేపథ్యంలో అది నిజమేనని తేలిపోయింది. అయితే ఆ హీరోలు, నిర్మాతలు ఎవరన్నది తేలాల్సి ఉంది. వారికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ అలా జరగకపోతే మొత్తం వ్యవహారాన్ని తప్పుబట్టాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెద్దలను వదిలేసి చిన్నవారినే పట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద హీరోలను పిలవకపోతే ఈ వాదనకు మరింత బలపడే అవకాశముందని భావిస్తున్నారు. అధికారులు చెబుతున్నట్లు పెద్ద వారిని పిలిచినా సంచలనం రేగుతుంది. ఇప్పటికే కుదేలైన సినీ పరిశ్రమ పరిస్థితి మరింత దిగజారుతుంది. అలాగే తెలుగు సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయిందనీ, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని చెప్పిన మాటలు కూడా పెనుదుమారం రేపనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా సినీ పరిశ్రమ కలిసికట్టుగానే ఉంది. కానీ, మత్తుమందుల కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులే ఇప్పుడు ప్రాంతీయ భేదాల గురించి మాట్లాడటం కచ్చితంగా సంచలనమే. దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Comments