ఈ బాటిల్‌ ఖరీదు ఎంతో తెలుసా?

సాధారణంగా వైన్‌ ధర ఎంతుంటుంది? మహా అయితే ఒక బాటిల్‌ రూ.10వేల వరకు ఉంటుంది. ఆ ధరే చాలా ఎక్కువ. కొన్ని రకాల వైన్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ఎందుకంటే అవి అరుదుగా లభిస్తుంటాయి కాబట్టి. ఒక్కోసారి వైన్‌ ధర.. అది తయారైన సంవత్సరాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందట. ఆస్ట్రేలియాలో ఇటీవల నిర్వహించిన వేలం పాటలో పాతకాలం నాటి ఓ వైన్‌ బాటిల్‌ కళ్లు తిరిగేలా రికార్డుస్థాయి రేటుకు అమ్ముడైంది.
పెన్‌ఫోల్డ్స్‌.. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వైన్‌ బ్రాండ్‌. ఆ బ్రాండ్‌కు చెందిన ఓ వైన్‌ బాటిల్‌ను ఎండబ్ల్యూ వైన్స్‌ సంస్థ వేలానికి అందుబాటులో ఉంచింది. 1951 నాటి వైన్‌ కావడంతో ఆ బాటిల్‌కు భారీ ధర పలికింది. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు అలాంటివి 20 బాటిళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత అరుదైన వైనో. అయితే తాజా వేలంలో పెన్‌ఫోల్డ్స్‌ బ్రాండ్‌ వైన్‌ ఒక్క బాటిల్‌ ధరే 51,750 ఆస్ట్రేలియా డాలర్లు పలికింది. అంటే .. భారతీయ కరెన్సీలో రూ.26లక్షల 31వేలకు పైమాటే. ఈ బాటిల్‌కు అసాధారణ రీతిలో భారీ ధర పలికిందని ఎండబ్ల్యూ వైన్స్‌ యజమాని నిక్‌ స్టామ్‌ఫోర్డ్‌ తెలిపారు.

Comments