‘బాహుబలి’ ఫీట్.. ప్రాణాలు పోయాయి


సినిమా జనాల మీద చూపించే ప్రభావం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా హీరోల విన్యాసాలు చూసి కుర్రకారు వెర్రెత్తి పోతుంటుంది. తమను తాము హీరోలుగా ఊహించేసుకుని నిజ జీవితంలో విన్యాసాలు చేస్తుంటుంది. తెర మీద జరిగేదంతా ఒక భ్రమ అని.. అక్కడ జరిగేది వేరని.. వాస్తవం కాదని అర్థం చేసుకోకుండా కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటుంటారు. ముంబయికి చెందిన ఇంద్రపాల్ పాటిల్ అనే యంగ్ బిజినెస్ మ్యాన్.. మహారాష్ట్రలోని షాహోపూర్ లోని మహులి కోట వద్ద ఉన్న జలపాతం దగ్గర ‘బాహుబలి’లో ప్రభాస్ తరహా విన్యాసం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు.

మిత్రులతో కలిసి విహారానికి వెళ్లిన ఇంద్రపాల్.. ఇదిగో నేను కూ బాహుబలిలా దూకుతా చూడండి అంటూ జలపాతంలోకి దూకాడు. కానీ నీటి లోపల ల్యాండింగ్ దగ్గర ఏదో తేడా జరిగింది. లోపల ఏం తాకిందో.. ఇంకేం జరిగిందో.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మనిషిగా నీళ్లలోకి దూకిన వాడు శవమై తేలాడు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ చేసేదంతా ఒక మాయాజాలం. అతడి చుట్టూ నీళ్లు లేవు. జలపాతం లేదు. కొండలు లేవు. బ్లూ మ్యాట్ వేసి రామోజీ ఫిలిం సిటీలోని ఒక సెట్లో అదంతా చిత్రీకరించారు. కానీ ఈ వాస్తవాన్ని గ్రహించక రియల్ బాహుబలి అనిపించుకుందామని చూసి ప్రాణాలు కోల్పోయాడు ఆ కుర్రాడు. ఇకనైనా వెండితెరపై చూసిన విన్యాసాల్ని నిజ జీవితంలో ప్రయత్నించడంపై కుర్రాళ్లు కొంచెం పునరాలోచించుకుంటే మంచిది.

Comments