ద ద దద్దరిల్లి పోతోంది

ప్రతిష్ఠాత్మక బాలీవుడ్‌ చిత్రం ‘రామ్‌లీల’ చిత్రీకరణ జరిగిన ప్యాలెస్‌ అది. పుణెలో ఉన్న ఆ ప్యాలెస్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌ చేస్తున్న సందడికి దద్దరిల్లిపోతోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. కీలకమైన యాక్షన్‌ ఘట్టాలతో పాటు, ఒక పాటని తెరకెక్కిస్తున్నారు. ‘రామ్‌లీల’ తెరకెక్కించిన ప్రదేశంలోనే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రతిభగల సాంకేతిక బృందం మధ్య మెరుపు వేగంతో చిత్రీకరణ జరుగుతోందని ఇటీవల ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెలాఖరు వరకు అక్కడే చిత్రీకరణ జరగబోతోంది. ఆగస్టు 12న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతినాయక ఛాయలతో కూడిన జై పాత్రకి సంబంధించిన టీజర్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఆగస్టు మొదటి వారంలో లవకుమార్‌ పాత్రతో కూడిన టీజర్‌ సందడి చేయబోతోంది. చిత్రాన్ని సెప్టెంబరు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Comments