పాతిక పెళ్లిళ్లు.. 145 మంది సంతానం

పాతికేళ్లలో 25 వివాహాలు చేసుకున్నాడు. 145కుపైగా మందిని సంతానంగా పొందాడు. కెనడాలో ఓ మాజీ మతపెద్ద నిర్వాకమిది. బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్‌స్టన్‌ బ్లాక్‌మోర్‌. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్‌ అనే ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్‌స్టన్‌ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారితో కాపురం చేసి 145కుపైగా మంది పిల్లలను కన్నాడు. వాస్తవానికి 1990ల్లోనే విన్‌స్టన్‌ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి కెనడా చట్టాల్లో ఉన్న లొసుగులతో విన్‌స్టన్‌ విచారణ, శిక్షల నుంచి తప్పించుకున్నాడు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని న్యాయస్థానం నిషేధించింది. ఆ తర్వాత కూడా విన్‌స్టన్‌ వివాహాలు చేసుకున్నాడు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో విచారణ నిర్వహించిన బ్రిటిష్‌ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్‌ షెరీ ఆన్‌ డొనెగాన్‌.. విన్‌స్టన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్‌స్టన్‌ స్పందిస్తూ.. భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిలు చేసుకున్నానని చెప్పడం విశేషం. మరోవైపు, జేమ్స్‌ ఓలర్‌(53) అనే వ్యక్తిని కూడా బహుభార్యత్వం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఓలర్‌కు ఐదుగురు భార్యలున్నారు. ఆయనకు శిక్ష ఖరారు కావాల్సి ఉంది.

Comments